ఈ నెల నుంచే రూ.4వేలు పింఛన్ విజయవాడ రూరల్ : పింఛన్ లబ్ధిదారులకు ఈ నెల నుంచి ప్రతి నెల రూ. 4వేలు ఇవ్వనున్నట్లు గన్నవరం నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ సోదరుడు యార్లగడ్డ సతీష్ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం పాతపాడు గ్రామంలో గురివారం సాయంత్రం ఆయన తన భార్య లక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి వెంకట్రావ్ చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ను రూ.4వేలకు పెంచడంతోపాటు ఏప్రిల్, మే,జూన్ నెలలకు సంబంధించిన బకాయిని కూడా జులై నెల పించిన్ తోపాటు ఇస్తామని ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇవ్వాల్సిన పింఛన్లు ఇవ్వనియ్య కుండా ఈ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. మరో రెండు నెలల్లో అభివృద్ధి ప్రభుత్వం వస్తుందని తదుపరి ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పరితపిస్తున్న తన సోదరుడు వెంకట్రావ్ కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీ చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. బందరు పార్లమెంటు కూటమి అభ్యర్థి బాలసౌరికి గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ జనసేన మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.......