బద్వేలులో టీడీపీ కు ఇబ్బందేనా ?

 


2019 ఎన్నికల్లో డాక్టర్ వెంకటసుబ్బయ్య వైసీపీ తరపున పోటీచేస్తే 95482 ఓట్లొచ్చాయి. అప్పుడు టీడీపీ అభ్యర్ధి ఓబుళాపురం రాజశేఖర్ కు 50748 ఓట్లొచ్చాయి. అదే ఎన్నికలో కాంగ్రెస్ కు 2337 ఓట్లు వస్తే బీజేపీకి వచ్చిన ఓట్లు 735 మాత్రమే. ఇపుడు టీడీపీ పోటీలో లేదు కాబట్టి ఆ ఓట్లన్నీ ఎవరికి పడతాయి ? లేదా ఎవరికీ పడకుండా మురిగిపోతాయా ? అనే విషయమై నియోజకవర్గంలో పెద్ద చర్చే జరిగింది. బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా తమ్ముళ్ళు కూర్చోవాలని నిర్ణయం అవ్వగానే టీడీపీ ఓట్లు కూడా కమలంపార్టీకి పడతాయని అందరికీ అర్ధమైపోయింది.

అందరు ఊహించినట్లుగానే బీజేపీకి టీడీపీ నుండి కొన్ని ఓట్లు పడ్డాయని అంతిమ ఫలితాలతో అర్ధమైపోయింది. లేకపోతే 735 ఓట్ల నుండి ఒక్కసారిగా 21 వేల ఓట్లకు పెరిగే ఛాన్సేలేదు. అయితే ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే కాంగ్రెస్ కు కూడా 6221 ఓట్లు పోలవ్వటం. 2019లో పడిన 2331 ఓట్లనుండి కాంగ్రెస్ కు దాదాపు 4 వేల ఓట్లు పెరగటమంటే మామూలు విషయం కాదు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే టీడీపీ ఓట్లే మెజారిటి బీజేపీకి పడి మరికొన్ని కాంగ్రెస్ కు కూడా పడ్డాయి.

నిజానికి బీజేపీ కాంగ్రెస్ కు ఇన్నేసి ఓట్లు పెరిగిపోయేంత సీన్ లేదని అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని వైసీపీ ఎంఎల్ఏ జోగిరమేష్ మాట్లాడుతు పోటీలో నుండి తప్పుకున్న టీడీపీ జనసేనలు బీజేపీకి ఓట్లు వేయించినట్లు చెప్పారు. స్ధానికంగా జరిగిన సర్దుబాట్ల వల్ల టీడీపీ ఓట్లలో ఎక్కువ బీజేపీకి తక్కువగా కాంగ్రెస్ కు పడినట్లు అర్ధమవుతోంది. ఇక్కడే టీడీపీకి ఇబ్బందులు మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. తాను పోటీలో లేనపుడు ఇక ఎన్నిక గురించి టీడీపీ నేతలు ఆలోచించకూడదు. కానీ అలాచేయకుండా ఇటు బీజేపీతో పాటు అటు కాంగ్రెస్ తో కూడా సర్దుబాటు చేసుకున్నారు.

రేపటి రోజున ఎన్నికల్లో టీడీపీ రంగంలోకి దిగితే అప్పుడు పక్క పార్టీలకు వెళ్ళిన ఓటుబ్యాంకుతో సమస్యలు వస్తాయి. పక్కపార్టీలకు వెళ్ళిపోయిన ఓటుబ్యాంకును తిరిగి వెనక్కు తెచ్చుకోవటం తమ్ముళ్ళకు ఇబ్బందిగా మారుతుంది. టీడీపీ పోటీలో లేదు కాబట్టి ఓటర్లు తమిష్టప్రకారం తాము ఇతర పార్టీలకు ఓట్లేయటం వేరు తమ్ముళ్ళే దారిమళ్ళించటం వేరు. ఇపుడు బీజేపీ కాంగ్రెస్ కు ఓట్లేయించిన తర్వాత టీడీపీకి ఓట్లేయాలని తమ్ముళ్ళు చెప్పినా రేపటి ఎన్నికలో ఓటర్లు వినకపోతే తమ్ముళ్ళు ఏమి చేయగలరు ? అనవసరంగా బీజేపీ కాంగ్రెస్ ను బలోపేతం చేసినందుకు తమ్ముళ్ళు తమను తాము నిందిచుకోవాల్సందే.